నిజానికి నేను కవిని కాను.. కానీ….

నిజానికి నేను కవిని కాను..

కాని..

దిగజారుతున్న
మానవ విలువలు
చుట్టూ జరుగుతున్న మోసాలు..
అవి చేసేందుకు మనుషులు వేస్తున్న వేషాలు
గమనిస్తూ బాధతో
ఓ పది వాక్యాలు..!

అవినీతి వ్యాపారాలు..
దగాకోరు దందాలు..
ఇవన్నీ చేస్తూ గుళ్ళలో
పొర్లుదండాలు..
పరికిస్తూ ఆందోళనతో
ఓ పది వాక్యాలు..!

ఎన్నికలప్పుడు నేతల వాగ్దానాలు..
అవి నెరవేర్చి మహానేతను
అనిపించుకునే తాపత్రయంలో
అప్పులు,తప్పులు చేస్తూ ముప్పులు తెచ్చి
జనం సొమ్మును జనానికే
ఖర్చు పెడుతూ మళ్లీ అందులో కూడా సింహభాగం నొక్కేస్తూ దానకర్ణుల్లా
పోజులు కొట్టే కుహానా
సంస్కర్తల ఆగడాలు
తెలిసీ ఏమీ చేయలేని ఉక్రోషంతో
ఓ పది వాక్యాలు..!

దేవుడి పేరిట
జరిగే మోసాలు..
ఆ దేవుణ్ణి కూడా
రాజకీయ ప్రయోజనాల కోసం వాడేసుకునే పాలకుల
యుక్తులు..కుయుక్తులు
వారిని నమ్మే జనాలు..
ఓటుకు నోటు పంచే పార్టీలు
ఆ నోటుకు కక్కుర్తిపడి
అయిదేళ్ల భవితను
అమ్మేసుకునే ఓటర్లు…
ఇలాంటి ఉదంతాలు
తెలిసి ఆవేదనతో
ఓ పది వాక్యాలు..!

కాషయం ముసుగులో చెప్పే
అభూత కల్పనలు..
వాటిని నమ్మి మోకరిల్లే
అమాయక జనాలు..
వారి చెవిలో పువ్వులు..
మనుషుల మధ్య
ఈ కులాలు..
మతాల చిచ్చులు..
తెగిపోయే బంధాలు..
పోయే ప్రాణాలు..
ఈ క్రీడలు చూస్తూ
సంబరపడే కర్కశులు…
ఇవన్నీ తెలిసి
ఓ పది వాక్యాలు..!

ఇంకా ఇంకా..చుట్టూ రోజూ
జరిగే ఎన్నో..
ఎన్నెన్నో అకృత్యాలు..
పెచ్చుమీరుతున్న
యువత పోకడలు..
చిరిగిపోయిన పాంట్లు..
ఎక్కడ చూసినా నిక్కర్లు..
నైటీలలో రోడ్లపై బ్యూటీలు..
దిక్కుమాలిన
డిప్పకటింగులు..
రబ్బరు బాండు
వింజామరలు..
ఆడామగా..కుర్రాడు..కుర్రది
ఫోన్లు..ఫేస్ బుక్కులు..
ఇన్స్టాగ్రాములు..ట్విట్టర్లు
టిక్ టాకులు..విడాకులు..
షేర్ చాట్లు..
ముంచుకొచ్చే అగచాట్లు..
సినిమాలు..షికార్లు..
ఐస్క్రీం పార్లర్లు..
బ్యూటీ పార్లర్లు…
వెర్రితలలు వేస్తున్న వ్యవహారాలు..
ఇవన్నీ పట్టించుకుంటూ
అక్షరాలలో ఆక్రోశం..
పదాలలో ఆవేశం..
పనికిరాని ప్రయోగం..
ప్రయోజనం లేని
ఓ ప్రయత్నం..!

ఇవన్నీ తీరిపోని బాధలే..
ఆగిపోని కథలే..
చెల్లిపోని వ్యధలే..
ఇవి రాస్తే కవినా..
కానే కాను..
చూస్తూ..ఏమీ చేయలేని నిస్సహాయున్ని..
చేతలతో మార్చగలిగే సంస్కర్తను కాను..
రాతలతో సరిదిద్దగలిగే
కవిని అంతకంటే కాను..
సగటు మనిషిని నేను!?

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Comment