HR9NEWS
ఏపీ సర్కార్ చేతికి శాంతి రిపోర్ట్ ! సాయిరెడ్డి పై పొగడ్తల నుంచి వివాదాస్పద నిర్ణయాల దాకా
ఏపీలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండైన శాంతిపై ఆమె మాజీ భర్త మదన్ మోహన్ తాజాగా చేస్తున్న బహిరంగ ఆరోపణలు, వాటికి ఆమె స్పందిస్తున్న తీరు నేపథ్యంలో ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. దీంతో వారు తాజాగా దేవాదాయమంత్రి ఆనం రామనారాయణరెడ్డికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఇందులో శాంతి ప్రవర్తన, వివాదాస్పద నిర్ణయాలు, విజయసాయిరెడ్డితో ఉన్న లింకు వంటి పలు అంశాలపై వివరాలు ఉన్నాయి.
తాను విదేశాలకు పీహెచ్‌డీ చేసేందుకు వెళ్లిన సమయంలో భార్య, దేవాదాయ శాఖ సస్పెండెడ్ డిప్యూటీ కమిషనర్ శాంతి వివాదాస్పద రీతిలో బిడ్డను కనడంపై ఆమె భర్త(మాజీ భర్త) మదన్ మోహన్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. వీటిపై స్పందిస్తూ తాను, మదన్ విడాకులు తీసుకున్నామని, ఆ తర్వాత లాయర్ సుభాష్ ను పెళ్లి చేసుకుని బిడ్డను కన్నట్లు ఇచ్చిన వివరణ, వైసీపీ ఎంపీ సాయిరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన తీరు నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అధికారులు ముందుగా దేవాదాయశాఖలో ఆమె ట్రాక్ రికార్డుపై వివరాలను రిపోర్టుగా ఇచ్చారు.
ఈ నివేదికలో 2021లో విశాఖలో దేవాదాయ శాఖ ఇన్ చార్జ్ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ పై ఇసుక చల్లిన వ్యవహారం, ఎన్టీఆర్ జిల్లాలో అధికారిణిగా పనిచేసినప్పుడు పలు ఆలయాల పరిధిలో లీజుల్లో ఆమె వ్యవహారశైలి, అనంతరం తాడేపల్లిలో 3 కోట్ల విల్లా కొనుగోలు వంటి అంశాల్ని ప్రస్తావించారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఆలయాల దుకాణాలకు వేలం లేకుండా లీజులను 11 ఏళ్ల పాటు పొడిగించిన వ్యవహారంలోనూ శాంతి వివాదాస్పద నిర్ణయాలను పేర్కొన్నారు. అలాగే మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలనూ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే సాయిరెడ్డిని గతంలో పొగుడుతూ ఆమె పెట్టిన ట్వీట్లనూ ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.