ఏపీలో కింగ్ మేకర్లు మహిళలే !
తమదే అధికారం అంటూ క్షేత్రస్థాయికి సంకేతాలు పంపుతున్న ఇరు పార్టీలు
ఏపీలో రిజల్ట్ చెప్పడానికి సాహసం చేయలేని సెఫాలజిస్టులు, ఏజెన్సీలు
ఓ పార్టీ అధినేతను బొమ్మరిల్లు ఫాదర్ గా మార్చిన 2024 ఎన్నికలు
ఆ సామాజిక వర్గానికి సింగిల్ లీడర్ గా ఓ పార్టీ అధినేతను నిలబెట్టిన వైనం
సర్వశక్తులు ఎదురొడ్డి పోరాడాడన్న పేరు సంపాదించిన మరో పార్టీ అధినేత
అమరావతి : ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టంగా మారింది
గెలుపు పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వారి అంతరంగంలో ఉన్న గుబులు మాత్రం అలాగే ఉంటుంది
పేరు మోసిన సెఫాలజిస్టులు, ఏజెన్సీలు, విశ్లేషకులు సైతం ఏపీలో ఫలితాలను, గెలుపు అంచనాలను
ధైర్యంగా ప్రకటించేంత సాహసం చేయలేకపోతున్నారు
విశ్వసనీయతకు, అబద్ధపు హామీలకు మధ్యనే ఈ ఎన్నికలు జరిగాయని ప్రజలంతా గత ఐదేళ్లుగా చెప్పిన మాటను చెప్పినట్లుగా నిలబెట్టుకుంటున్న తమ పార్టీకి పట్టం కడతారని అధికార వైకాపా ధీమావ్యక్తం చేస్తోంది
మరోవైపు నియంతృత్వాన్ని నియంత స్వభావాన్ని కొనసాగిస్తున్న జగన్ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, “ప్రభుత్వ వ్యతిరేక ఓటు” తమ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు కలసి వచ్చి, అధికారం చేపట్టబోతున్నామని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మరియు కూటమి తమ విజయవకాశాలను గట్టిగానే విశ్వసిస్తున్నారు
అయితే ఈ ఎన్నికలు ఆయా పార్టీల అధినేతల తీరు తెన్నులను ప్రజాక్షేత్రంలో స్పష్టం చేశాయని చెప్పవచ్చు
చెప్పినవి చేశాం! చెప్పనివి చేశాం! అనే నినాదంతో ఎన్నికల బరిలోకి ధైర్యంగా సిద్ధమై వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలిగింది. అయితే ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత అనుసరించిన విధానాలు, వ్యూహం పరిశీలిస్తే
ఎక్కడా ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగారు.. అదేవిధంగా ప్రచారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే కొనసాగించారు. 2019 ఎన్నికలలో జగన్ కుటుంబ సభ్యులందరూ ప్రచారంలో రోడ్డుమీద ఉండగా
ఈ ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క నినాదంగా అధినేత జగన్
పేరు మాత్రమే వినపడింది. పైగా తాను నమ్మిన ఐప్యాక్ బృందం వ్యూహం తప్ప, వేరే ఎవరికీ ఎక్కడా ఎలాంటి ఇతర వ్యూహం లేకుండా, ఏ దశలోనూ అస్పష్టత లేకుండా, తన కనుసన్నల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను జగన్ నిర్వహించగలిగారు
అభ్యర్థులకు సునాయాసంగా, అదనపు ఒత్తిడి లేకుండా ఈ వ్యూహం ఎంతో మద్దతుగా నిలిచినప్పటికీ, వారి మదిలో తమ అధినేతను బొమ్మరిల్లు ఫాదర్ గా నిలిపాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు
మరోవైపు “ప్రభుత్వ
వ్యతిరేక ఓటు చీల్నివ్వను” అనే ఏకైక నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ కూటమి ఏర్పాటులో కీలక భూమిక వహించింది. 2019లో రాష్ట్రంలో ఒకే ఒక్క సీటు మాత్రమే సొంతం చేసుకున్న ఈ పార్టీ, 2024 ఎన్నికలలో మాత్రం కీలకంగా మారింది
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రేక్షకాదరణను రాజకీయ ఆదరణగా మార్చుకోవడంలో, తన సామాజిక వర్గం నుండి అత్యధిక శాతం మద్దతును కూడగట్టడంలో విజయం సాధించగలిగారని చెప్పవచ్చు
ఇంకా చెప్పాలంటే ఆ సామాజిక వర్గ మొత్తానికి సింగిల్ లీడర్ గా, ఐకానిక్ పర్సనాలిటీగా ఈ ఎన్నికలు ఆయనకు గుర్తింపు తెచ్చి, గతం కంటే మెరుగ్గా నిలబెట్టాయని తెలుస్తోంది.
ఏడు పదుల వయసులో కూడా ఒక రాజకీయ పార్టీకి సంపూర్ణ సారధ్యం వహించడం, కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో తన పూర్తి సామర్థ్యంతో పని చేశారనే
ఖ్యాతిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంతం చేసుకున్నారు.
మొత్తం ఎన్నికల ప్రక్రియలో తన అనుభవసారాన్ని, కూటమి మద్దతును పూర్తిగా వినియోగించి అధికార పార్టీకి గట్టి పోటీని ఇవ్వగలిగారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవాలనే సందేశాన్ని, అధికారంలోకి వస్తామని విశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలిగారు.
ఇక అసలు విషయానికొస్తే ఈ ఎన్నికలలో నిజమైన “కింగ్ మేకర్స్” గా నిలుస్తుంది రాష్ట్రంలోని మహిళా ఓటర్లు మాత్రమే!
ప్రతిసారి ఎన్నికలలో మహిళా ఓట్లే కీలకం అనే నానుడి ప్రచారంలో కొనసాగుతున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో మాత్రం “అధికార కిరీటం” ఎవరిని వరించాలనే అంశం పూర్తిగా వారి నిర్ణయాన్ని బట్టే ఉంటుంది.
ఎవరికి వారు తమ సర్వశక్తులను ఎదురొడ్డి ఎన్నికల బరిలో తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు.
అయితే ఎవరి సంప్రదాయ ఓటు బ్యాంకు వారికే బలంగా నిలవనుండగా, అధికార అందలాన్ని ఎక్కించే కీలక ఓటు మాత్రం మహిళల చేతిలోనే ఉందని స్పష్టమవుతోంది
ఓటింగ్ సరళిని పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాహాటంగా పోలింగ్ కు హాజరై గతంలో కంటే మెరుగ్గా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పురుష సమాజం రెండుగా చీలిపోయి, ఎవరు ఏ పార్టీకి మద్దతుగా నిలిచారనే విషయం దాదాపుగా స్పష్టం అవుతున్న వేళ, మహిళా ఓటు మాత్రం అత్యంత గోప్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు 2014 ఎన్నికలలో ఇదే కూటమి అధికారం సాధించిన నేపథ్యంలో, అధికార పార్టీపై మహిళల్లో ఏ మాత్రం వ్యతిరేకత ఉన్నా,అది ప్రతిపక్షానికి బలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.