ఆమెకు బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ- కొడుకు పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాది

ఆమెకు బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ- కొడుకు పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాది

బెయిల్ పిటిషన్ పై విచారణ ముగించిన స్పెషల్ కోర్టు

  • 8న తీర్పు వెల్లడించనున్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితే సూత్రధారి అని, అందుకే ఆమె బెయిల్ అప్లికేషన్ను వ్యతిరేకిస్తున్నామని ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హౌస్సేన్ కోర్టుకు తెలిపారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని వాదించారు. అయితే కొడుకు పరీక్షల నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఈ పిటిషన్పై ఇరువైపు వాదనలు విన్న స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. ఈనెల 8న ఉదయం తీర్పు వెలువరించనున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్టై… తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవిత తన చిన్న కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్పై గురువారం స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా విచారణ జరిపారు. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరపున జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై ఈడీ దాఖలు చేసిన కౌంటర్కు రిజాయిండర్ ఫైల్ చేసినట్లు సింఘ్వీ కోర్టుకు తెలిపారు. పీఎంఎల్ఎ సెక్షన్ 45 ప్రకారం మహిళగా, అలాగే కొడుకు పరీక్షల నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కవిత అరెస్ట్తో ఆమె కుమారుడు మానసికంగా కుంగిపోయాడని, ఈ ప్రభావంతో పరీక్షలకు గైర్హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. పిల్లల పరీక్షల సందర్భంలో తల్లి మద్దతు పిల్లలకు అవసరమన్నారు.

తండ్రి, తల్లి పాత్రను భర్తీ చేయలేరని, ఇదే అంశంపై ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నారని కోర్టుకు వివరించారు. ఇలాంటి సందర్భంలో గతంలో పలు కేసుల్లో మహిళలకు న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేసిన కేసుల వివరాలు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రీతి చంద్రా, సౌమ్య చౌరసియా కేసులను సింఘ్వీ ఉదాహరించారు. కవితకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినా… తమకు అభ్యంతరం లేదన్నారు.

తల్లి తో ఉన్న ఆత్మీయత, అనుంబంధాన్ని ఎవరూ తీర్చలేరు. మన కుటుంబాలకు ఓ విధానం ఉంది. దీంట్లో తల్లి పాత్ర కీలకం. కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. తల్లి జైల్లో ఉంది. తండ్రి కోర్టు కేసుల కోసం ఢిల్లీలో ఉన్నారు’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


ఆమె ఆధారాలు,సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు: ఈడీ
లిక్కర్ కేసులో కవిత పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోర్టుకు వివరించారు. దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల పూర్తి దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందన్నారు. అలాగే ఆమె బెయిల్పై బయటకు వస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆరోపించారు. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు నివేదించారు.

లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవిత. ఆధారాలను ధ్వంసం చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదు. కవిత మొబైల్ ఫోన్లను మార్చడంతో పాటు ఆధారాలు ధ్వంసం చేశారు.’ అని చెప్పారు. ఆమె ఈడీకి సమర్పించిన ఫోన్లలో సమాచారాన్ని డిలీట్ చేశారన్నారు. ఇందులో 9 ఫోన్లను ఫార్మాట్ చేసి, డేటా డిలీట్ చేశారని కోర్టుకు వివరించారు. ఆమె సమర్పించిన మొత్తం 10 ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ డేటా ప్రకారం 4 ఫోన్లు ఫార్మాట్ చేయబడ్డాయని తెలిపారు. ఈ కేసులో వందల కొద్దీ డిజిటల్ పరికరాల్లో డేటా డిలీట్ చేయబడిందని చెప్పారు. మధ్యలో ఈడీ జాయింట్ డైరెక్టర్ భాను ప్రియా మీనా… కవితకు వ్యతిరేకంగా సేకరించిన సున్నితమైన ఆధారాలను నేరుగా జడ్జి కావేరి బవేజాకు చూపించారు.

కవిత తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ అప్రూవర్ గా మారిన వ్యక్తిని బెదిరించారని ఆరోపించారు. కవితకి లిక్కర్ వ్యాపారంలో 33 శాతం వాటా ఉందని వాదించారు. ‘పరీక్షలు రాస్తోన్న కవిత కొడుకుకు… 22 ఏండ్ల సోదరుడు, తండ్రి, కవిత అక్కా చెల్లెళ్లు ఉన్నారు’ అని తెలిపారు. భారతీయ కుటుంబాల్లో ఇతర కుటుంబ సభ్యులు కూడా పిల్లలకు మద్దతుగా నిలుస్తారని వాదించారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు ముగిసాయని, కవిత కుమారుడికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. 19 ఏండ్ల కవిత పెద్ద కొడుకు స్పెయిన్లో ఉన్నాడని, అరెస్టైన తల్లిని చూసి తాను వెళ్ళిపోయాడని తెలిపారు. కవిత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, ఐటీఆర్ వివరాలు, కుటుంబ వ్యాపార వివరాలు ఇవ్వడం లేదన్నారు.

మహిళ కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వమనడం సరికాదన్నారు. మధ్యంతర బెయిల్పై వాదనలు ఇవ్వకుండా కేస్ డైరీపై వాదనలు వినిపిస్తున్నారని అభిషేక్ మను సింఘ్వీ అభ్యంతరం తెలిపారు. కాగా, ఇరువైపు వాదనలు ముగించిన స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. ఏప్రిల్ 8 (సోమవారం) ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని వెల్లడించారు.

Leave a Comment