టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌

టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. క్రికెట్‌ కెరీర్‌లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్‌.

ఇండియన్‌ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని జై షా పేర్కొన్నారు. బీసీసీఐ ఆయన అన్నివిధాలా సహకరిస్తుందని చెప్పారు.

టీ20 ప్రపంచకప్‌తో ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త కోచ్‌గా గంభీర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. గంభీర్‌ సారథ్యంలోనే భారత్‌.. శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. సహాయక కోచ్‌ల ఎంపిక విషయంలో కూడా బీసీసీఐ గంభీర్‌కు పూర్తిస్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇవాళ మధ్యాహ్నం వరకు జీతభత్యాల విషయంలో బీసీసీఐ, గంభీర్‌ల మధ్య ఇంకా చర్చలు కొనసాగినట్లు సమాచారం. ఇవాళ ఉదయమే అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ఈ కారణంతోనే ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

అదే నా ముందున్న లక్ష్యం-గంభీర్‌

టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా తనను నియమించడంపై గంభీర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

భారతదేశమే నా గుర్తింపు. నా దేశానికి సేవ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. వేరే క్యాప్‌ పెట్టుకున్నా (రాజకీయాల్లోకి వెళ్లినా). మళ్లీ సొంతగూటికి రావడం గర్వంగా ఉంది. ప్రతి భారతీయుడినీ గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే ప్రస్తుతం నాముందున్న లక్ష్యం.

1.4 కోట్ల మంది భారతీయుల కలల్ని నీలం రంగు జెర్సీలు ధరించిన ఆటగాళ్లు మోస్తున్నారు. అందరి కలల్ని నిజం చేయడానికి శక్తి మేరకు కృషి చేస్తా అంటూ రాసుకొచ్చారు.

Leave a Comment